Ezekiel 3

1ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, నీకు కనిపించిన దాన్ని తిను! ఈ పత్రాన్ని తిను. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ళతో మాట్లాడు>> 2దాంతో నేను నోరు తెరిచాను. ఆయన నాకు ఆ పత్రాన్ని తినిపించాడు. 3తరువాత ఆయన నాతో <<నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ పత్రాన్ని ఆహారంగా తీసుకో. దాంతో నీ కడుపు నింపుకో>> అన్నాడు. కాబట్టి నేను ఆ పత్రాన్ని తిన్నాను. అది నా నోటిలో తేనెలా తియ్యగా ఉంది.

4అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి చెప్పు. 5అపరిచితమైన మాటలు పలికే వాళ్ళ దగ్గరకో, కఠినమైన భాష మాట్లాడే వాళ్ళ దగ్గరకో నిన్ను పంపించడం లేదు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకే నిన్ను పంపిస్తున్నాను. 6నువ్వు వెళ్తున్నది నీకు అర్ధం కాకుండా విచిత్రంగా పలికే బలమైన దేశం కాదు. లేదా కఠినమైన భాష మాట్లాడే దేశమూ కాదు! అలాంటి వాళ్ళ దగ్గరకి నిన్ను పంపితే వాళ్ళు నీ మాటలు వింటారు! 7కానీ ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు.

8ఇలా చూడు! నీ ముఖాన్ని వాళ్ళ ముఖాల్లాగే మూర్ఖంగానూ నీ నుదురును వాళ్ళ నుదుళ్ళ లాగే కఠినంగానూ చేశాను. 9నీ నుదురును వజ్రంలా చేశాను. దాన్ని చెకుముకి రాయి కంటే కఠినంగా చేశాను. వాళ్ళు తిరగబడే జాతి అని వాళ్ళకి నువ్వు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి నిరుత్సాహపడవద్దు.>>

10తరువాత ఆయన నాకు ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, నేను నీకు చెప్పే మాటలను చెవులారా విను. వాటిని నీ మనసులో ఉంచుకో. 11తరువాత చెరలో బందీలుగా ఉన్న నీ ప్రజల దగ్గరకి వెళ్లి వాళ్ళతో మాట్లాడు. వాళ్లకి <ప్రభువైన యెహోవాా చెప్తున్నాడు> అంటూ ప్రకటించు.>>

12అప్పుడు ఆత్మ నన్ను పైకి తీసుకువెళ్ళాడు. నా వెనుక <<యెహోవాా మహిమకు ఆయన నివాస స్థలంలో స్తుతి కలుగుతుంది గాక>> అనే స్వరం వినిపించింది. ఆ స్వరం ఒక మహా భూకంపం వచ్చినట్టుగా వినిపించింది. 13అంటే ఆ జీవుల రెక్కలు ఒక దానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దమూ, ఆ చక్రాలు కదిలినప్పుడు కలిగిన చప్పుడూ, ఒక మహా భూకంపం వచ్చినప్పుడు కలిగే శబ్దమూ నాకు వినిపించాయి.

14ఆత్మ నన్ను పైకి లేపి తీసుకు వెళ్ళాడు. యెహోవాా హస్తం నన్ను తీవ్రంగా బలవంతం చేయడంతో నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనై బయలుదేరాను! 15అలా నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలానికి వెళ్ళాను. అక్కడ బందీలుగా వచ్చిన కొందరు నివాసముంటున్నారు. అక్కడే నేను ఏడు రోజులు దిగ్భ్రమతో నిండి ఉండిపోయాను.

16ఆ ఏడు రోజులు గడచిన తరువాత యెహోవాా వాక్కు నా దగ్గరకు వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. 17<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచేయి! 18ఒక దుర్మార్గుడికి <నువ్వు కచ్చితంగా చస్తావు> అని నేను చెప్పినప్పుడు నువ్వు వాడికి ముందు జాగ్రత్త చెప్పక పోయినా, వాడు బతికి ఉండటానికి తన దుర్మార్గపు పనులను విడిచిపెట్టాలని వాణ్ణి హెచ్చరించక పోయినా వాడు తన పాపాలను బట్టి తప్పకుండా చస్తాడు. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను. 19అయితే ఒకవేళ నువ్వు ఆ దుర్మార్గుణ్ణి హెచ్చరించినప్పుడు వాడు తన దుర్మార్గతను వదిలిపెట్టకుండా పాపాలు చేస్తూనే ఉంటే వాడు తన పాపాల మూలంగానే చస్తాడు. కానీ నువ్వు తప్పించుకుంటావు.

20నీతి గలవాడు తన నీతిని విడిచిపెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తే నేను వాడి ఎదుట ఒక ఆటంకాన్ని ఉంచుతాను. అతణ్ణి నువ్వు హెచ్చరించలేదు కాబట్టి అతడు చనిపోతాడు. అతడు తన పాపంలోనే చనిపోతాడు. అతడు నీతిగా జరిగించిన పనులను నేను ససేమిరా జ్ఞాపకానికి తెచ్చుకోను. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను. 21ఒకవేళ నీతిగల వాణ్ణి పాపం చేయ వద్దని నువ్వు హెచ్చరిక చేస్తే, ఆ హెచ్చరికను బట్టి అతడు పాపం చేయకుండా ఉంటే అతడు తప్పకుండా బతుకుతాడు. నువ్వూ తప్పించుకుంటావు.>>

22అక్కడ యెహోవాా హస్తం నాపై ఉంది. ఆయన నాతో ఇలా అన్నాడు. <<నువ్వు లే, మైదాన ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నేను నీతో మాట్లాడుతాను.>> 23నేను లేచి మైదాన ప్రాంతానికి వెళ్ళాను. కెబారు నదీ ప్రాంతంలో నేను చూసిన యెహోవాా తేజస్సు అక్కడ ఉంది. కాబట్టి నేను సాష్టాంగపడ్డాను.

24
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Ezk 3:25.
In this translation, this verse contains text which in some other translations appears in verses Ezk 3:24-Ezk 3:25.
25అప్పుడు ఆత్మ నా దగ్గరకి వచ్చి నన్ను లేపి నిల్చోబెట్టాడు. అప్పుడు ఆయన నాతో ఇలా మాట్లాడాడు. <<నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళకుండా వాళ్ళు వచ్చి నీపై తాళ్ళు వేసి నిన్ను బంధిస్తారు. అందుకే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో తలుపులు వేసుకుని ఉండు.

26వాళ్ళు తిరగబడే ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళని గద్దించకుండా నేను నీ నాలుకను నీ నోట్లో అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉంటావు. కానీ నేను నీతో మాట్లాడుతాను. వాళ్లకి <ప్రభువైన యెహోవాా ఇలా చెప్పాడు> అని నువ్వు చెప్పడానికి నీ నోరు తెరుస్తాను. వాళ్ళు తిరుగుబాటు చేసే జనం కాబట్టి వినేవాడు వింటాడు. విననివాడు వినకుండానే ఉంటాడు.>>

27

Copyright information for TelULB